భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం కొందరు భక్తులు గంటల తరబడి వేచి ఉంటారు. మరికొంత మంది త్వరగా దర్శనం చేసుకోవాలని దళారులను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే అలాంటి భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. దర్శనానికి విచ్చేసే భక్తులు దళారులను ఆశ్రయించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
టీటీడీకీ సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా లేదా టోకెన్ జారీ కౌంటర్ల ద్వారా మాత్రమే నమోదు చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఇటీవల శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌కు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి దగ్గర 90 వేలు తీసుకుని మోసం చేసినట్లు తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది టీటీడీ. తమ 12 మందికి వీఐపీ బ్రేక్ టికెట్లు ఇస్తామని మోసం చేశారని.. తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ వారు స్పందించ లేదని బాధితుడు టీటీడీకీ ఫిర్యాదు చేయగా.. టీటీడీ విజిలెన్స్ విభాగం విచారించింది.
అయితే ఆ ఇద్దరు వ్యక్తులు గతంలో కూడా హైదరాబాద్‌లో ఇలాగే మోసం చేశారని.. వారిపై 12 కేసులు నమోదైయ్యాయని తెలిపింది. డబ్బులు వసూలు చేస్తూ భక్తులను మోసం చేస్తున్న వనం నటరాజు నరేంద్ర కుమార్, నటరాజు శర్మలు టీటీడీకి చెందిన వారు కాదని ఈ సందర్భంగా టీటీడీ ప్రకటనలో తెలిపింది. నకిలీ దర్శన టికెట్ల బుకింగ్‌లపై తరచూ టీటీడీకి ఫిర్యాదులు అందుతున్నాయని.. టీటీడీ సేవలకు సంబంధించి.. భక్తులు టీటీడీ అధికార వెబ్‌సైట్‌లను మాత్రమే ఆశ్రయించాలని కోరింది.