భారత్ సమాచార్.నెట్, కృష్ణా: మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో శుక్రవారం ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాల వల్ల లక్షల మంది మహిళలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రతి మహిళకు నెలకు సగటున రూ.2వేలు ఆదా అవుతుందని, ఈ పథకం అమలు వల్ల ప్రభుత్వంపై రోజుకు రూ.162కోట్ల భారం పడుతుందని చెప్పారు. త్వరలో మచిలీపట్నంలో మహిళల కోసం ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గీతాజంలి శర్మ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణాశాఖాధికారి వెంకటేశ్వర్లు, డిపో మేనేజర్ పెద్దిరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు