భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కూరగాయల సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న సూచించారు. నెల్లికుదురు మండలం సీతారామపురంలో సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన వివిధ కూరగాయల పంటలను పరిశీలించారు. కూరగాయల పందిరి సాగు, మల్చింగ్ విధానాలను పరిశీలించి రైతులతో సాగు పద్ధతులు, దిగుబడులు, మార్కెట్ అవకాశాలపై చర్చించారు.

రైతులు నిత్యం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కూరగాయలను సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని మరియన్న తెలిపారు. టమోటా, వంకాయ, బెండ, బీర, సొర, కాకర, పచ్చిమిరప, గోరుచిక్కుడు, ఆకుకూరలు, బీట్‌రూట్, క్యారెట్, ముల్లంగి, క్యాబేజీ, కాలీఫ్లవర్, కంద, చేమ, దొండ, పొట్ల, ఉల్లి తదితర పంటలకు ఏడాది పొడవునా మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందని చెప్పారు.

సంవత్సరానికి 3 నుంచి 4 పంటలు.. ఎకరానికి రూ.2 లక్షలకు పైగా ఆదాయం

కూరగాయల పంటల్లో పంటల మార్పిడి, పందిరి సాగు, మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులను అవలంబిస్తే సంవత్సరానికి మూడు నుంచి నాలుగు పంటలు తీసుకోవచ్చని తెలిపారు. తద్వారా ఎకరానికి రూ.2 లక్షలకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. సరైన ప్రణాళికతో కూరగాయల సాగు చేపడితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాదిరిగా ప్రతి నెలా ఆదాయం వచ్చే విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.

ప్రస్తుతం వరి, మొక్కజొన్న, పత్తి, మిరప వంటి పంటల సాగు విస్తీర్ణాన్ని కొంత తగ్గించి, మార్కెట్ డిమాండ్ ఉన్న కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని మరియన్న కోరారు. తక్కువ విస్తీర్ణంలోనూ అధిక ఆదాయం పొందే అవకాశం ఉన్న కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ అందిస్తున్న సాంకేతిక సూచనలు, ఆధునిక సాగు పద్ధతులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.