భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పుకోదగిన ప్రయోజనాలు కల్పించకుండానే వెయ్యి రోజుల పాలన సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని భాజపా జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 22ఏ జీవో సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై పోలీసులు వ్యవహరించిన తీరును మల్లేష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్షుడన్న కనీస మర్యాదను కూడా పాటించకుండా ఆయనను పోలీసులు ఈడ్చుకెళ్లడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారపూరిత పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.

విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 22ఏ జీవో సమస్యకు పరిష్కారం చూపాలని భాజపా డిమాండ్ చేస్తోందని మల్లేష్ గౌడ్ తెలిపారు. ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్షంగా భాజపా నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఆందోళనలను అణచివేయడం సరైన విధానం కాదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉందని మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు. కేవలం సంబరాలు చేసుకోవడం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు సంగసాని సురేష్, రమేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.