భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అసెంబ్లీ ప్రాంగణం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు చార్ల ఆంజనేయులు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన స్పీకర్ పదవికి, ఒక దళిత నాయకుడికి అవమానం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజమేనని, అయితే వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
ఈ ఘటనకు నిరసనగా నర్సాపూర్ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నర్సాపూర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ నాయకులు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నత పదవులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైనా ఉందని చార్ల ఆంజనేయులు అన్నారు.
దళిత నాయకుడిని అవమానిస్తే చూస్తూ ఊరుకోము
దళిత నాయకుడిని అవమానించేలా ఎవరైనా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని చార్ల ఆంజనేయులు స్పష్టం చేశారు. పదవిలో ఉన్న వ్యక్తి విధానాలను, రాజకీయ నిర్ణయాలను విమర్శించవచ్చని, కానీ వ్యక్తిగతంగా అవమానించడం, కించపరిచే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. తెలంగాణలో దళితులకు గౌరవం, సమానత్వం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, దళిత నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎన్‌ఎస్‌యూఐ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని పేర్కొన్నారు.
అసెంబ్లీ వంటి ప్రజాస్వామ్య వేదికల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని చార్ల ఆంజనేయులు అన్నారు. ఇకనైనా బీఆర్‌ఎస్ నాయకులు తమ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అర్జున్, కిషోర్, లోకేష్, ప్రవీణ్ నాయక్, ప్రవీణ్ ముదిరాజ్, వేణు, సుదంష్, శ్రీనాథ్ తదితరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





