భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతేనని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో బండారి పార్థసారథి, ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. సర్పంచి తమ్మడపల్లి కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. ఇంకా కార్డులు లేని వారు, కొత్తగా పెళ్లైన వారు దరఖాస్తు చేసుకునేందుకు సైట్ అందుబాటులో ఉందని తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డులు బహుళ ప్రయోజనకరంగా ఉంటాయని ఎమ్మెల్యే వివరించారు. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు కార్డులోనే పొందుపరిచి ఉంటాయని, సులభంగా రేషన్ సరుకులు పొందడంతో పాటు నకిలీ కార్డుల నివారణకు ఇవి ఉపయోగపడతాయన్నారు. ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్’ ద్వారా దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్ సేవలు, ప్రభుత్వ గుర్తింపు అవసరాలకు కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో పేదలు తిండి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. రైతులు సన్న వడ్లు పండించి మద్దతు ధరతో పాటు అదనపు బోనస్ పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి కోసమే ఇనుగుర్తిలో ఏటీసీ
ఇనుగుర్తి మండల యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వెనుకబడి ఉండటంతోనే ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) మంజూరు చేసిందని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్ తదితర సముదాయ కార్యాలయాలను ఒకేచోట నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి రూ.2.25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రహదారులను మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు 20 శాతం నిధులు విడుదల చేయకపోవడంతో ఈసారి ఇళ్ల కేటాయింపులో కొంత తగ్గుదల కనిపించిందని, వచ్చే విడతలో పెద్ద మొత్తంలో ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సన్న బియ్యం అమ్మినా.. కొన్నా కఠిన చర్యలు: తహసీల్దార్
తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజల కోసం అధిక ధరకు సన్న బియ్యం కొనుగోలు చేసి ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున అందిస్తోందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్న బియ్యాన్ని లబ్ధిదారులు విక్రయించినా, దళారులు కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లబ్ధిదారులు బియ్యాన్ని విక్రయించినట్లు తేలితే రేషన్ కార్డులను తొలగిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం: లబ్ధిదారు పిచ్చమ్మ
గత కొన్నేళ్లుగా పేదలకు రేషన్ కార్డులు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం కూడా అందిస్తోందని ఇనుగుర్తి గ్రామానికి చెందిన లబ్ధిదారు పడాల పిచ్చమ్మ అన్నారు. ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు తమ్మడపల్లి కుమార్, ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి, మీటు నాయక్, ఇస్లావత్ నరేష్, చెడుపాక సుజాత యాకయ్య, భూక్య లక్ష్మీ వెంకన్న, దిశ సభ్యుడు బాబురావు, ఉపసర్పంచి సత్తూరి యాదగిరి, ఆర్ఐలు బషీర్, మున్వర్, ఏఎంసీ డైరెక్టర్ కొట్టం రాము, పీఏసీఎస్ డైరెక్టర్ కొట్టం మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్, జీపీవోలు, రేషన్ డీలర్లు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు.


