భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: పట్టణాల్లో విద్యుత్ సరఫరా దాదాపు నిరంతరంగా కొనసాగుతున్నప్పటికీ.. పల్లెలకు వచ్చేసరికి మాత్రం గంటల తరబడి విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారనే ప్రశ్నలు గ్రామీణ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలు విధించడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సాయంత్రం సమయంలోనే కుటుంబాలకు ఇంటి పనులు, పిల్లలకు చదువులు, రైతులకు వివిధ అవసరాలు ఉంటాయి. అదే సమయంలో దోమల బెడద కూడా ఎక్కువగా ఉండటంతో కరెంట్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
రైతులకు సాగు, నీటి అవసరాల కోసం విద్యుత్ అవసరం. కుటుంబాలకు రోజువారీ అవసరాల కోసం కరెంట్ కావాలి. పిల్లలు చదువుకోవడానికి వెలుతురు అవసరం. దోమల బెడద నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు కూడా నడవాలి. ఇలాంటి సమయంలో సాయంత్రం వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామీణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టణ ప్రజలకే విద్యుత్ అవసరమా?
పట్టణ ప్రజలకు అవసరమైన విద్యుత్.. పల్లె ప్రజలకు అవసరం లేదా? పల్లెలు కూడా ఇదే రాష్ట్రంలో భాగమే. గ్రామీణ ప్రజలు కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు కూడా తమ పనులకు విద్యుత్‌పై ఆధారపడుతున్నారు. అలాంటప్పుడు విద్యుత్ కోతల భారం ఎక్కువగా పల్లెలపైనే పడటంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సమాన విద్యుత్ సరఫరా అందించాలి
ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ కోతల సమస్యను వెంటనే గుర్తించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పల్లె ప్రజల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని పట్టణాలు, గ్రామాలకు సమానంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని కోరుతున్నారు. విద్యుత్ మా హక్కు.. పల్లెలకు కూడా సమాన హక్కు. పల్లెను నిర్లక్ష్యం చేయకండి అని గ్రామీణ ప్రజలు అంటున్నారు.



