భారత్ సమాచార్, హైదరాబాద్: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని కాంగ్రెస్ పార్టీ పెద్దలను కోరినట్లు తెలంగాణ మంత్రి కొండా సురేఖ తెలిపారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తన వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. తన వ్యవహారంపై పార్టీలో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని అన్నారు.
నా బిడ్డ స్వతంత్రంగా ఉంది.. ఆమె జీవితం ఆమె ఇష్టం
కాంగ్రెస్ అధిష్ఠానానికి తాను చెప్పుకోవాల్సిందంతా చెప్పానని, పార్టీ పెద్దలు ఆలోచిస్తామని చెప్పారని కొండా సురేఖ తెలిపారు. తన కుమార్తె సుస్మిత పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలిగా మాట్లాడిందని భావిస్తున్నానని, ఆమె జీవితం ఆమె ఇష్టమని అన్నారు. తనతో పాటు తన భర్త రాజకీయ జీవితం కూడా తమ ఇష్టమేనని పేర్కొన్నారు. తాను మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్నానని, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నానని చెప్పారు. తనను పదవిలో కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.
నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడమే తప్పు
సుస్మిత వ్యాఖ్యలపై తాను స్పందించబోనని కొండా సురేఖ స్పష్టం చేశారు. రోజూ ఎంతో మంది మాట్లాడుతుంటారని, అందులో సుస్మిత కూడా ఒకరని అన్నారు. తన కుమార్తె కాబట్టి ఆమె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను ఖండించడం, సమర్థించడం రెండూ చేయబోనన్నారు. తన వివరణను మీనాక్షి నటరాజన్‌కు కూడా చెప్పానని, ఆమె అధిష్ఠానానికి వివరిస్తానని చెప్పినట్లు తెలిపారు.
తనపై పార్టీలో కొందరితో ఆరోపణలు చేయించారని కొండా సురేఖ ఆరోపించారు. ఎవరు అలా చేయించారో తనకు తెలుసని, అయితే పేర్లు చెబితే వివాదం అవుతుందని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ ఆ దిశగా కూడా ఆలోచించాలని కోరారు. ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్నందుకే దిల్లీకి వచ్చి తన బాధను చెప్పుకున్నానని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు రాతపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన తదుపరి ఆలోచన ఉంటుందని కొండా సురేఖ తెలిపారు.





