భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బాసర పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల రమావత్ సాయికిరణ్ గోదావరి నదిలో పడి మృతి చెందాడు. యూకేలో MBA చదువుతున్న సాయికిరణ్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 5న తిరిగి యూకే వెళ్లాల్సి ఉంది.
ఈ క్రమంలో మంగళవారం సాయికిరణ్ బాసర ఆలయానికి వెళ్లాడు. దైవదర్శనం అనంతరం బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వారు వెంటనే నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
కుటుంబ సభ్యులు, స్థానికుల గాలింపు చర్యలు కొనసాగించగా బుధవారం సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యూకేలో MBA పూర్తి చేసి ఉన్నత భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సిన యువకుడు ఇలా మృత్యువాత పడటంతో కౌల్పూర్ గ్రామంలో విషాదం నెలకొంది.
సాయికిరణ్ తండ్రి రమావత్ భోజారామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాసర స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.





