భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అర్ధ వార్షిక తనిఖీ షెడ్యూల్‌లో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం ఈవీఎం (EVM) గోదామును తనిఖీ చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన ఈ తనిఖీలో గోదాంలో భద్రపరిచిన ఎన్నికల యంత్రాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవీఎం గోదాంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థను, ప్రవేశ నియంత్రణ చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలకు సంబంధించి చేపడుతున్న భద్రతా చర్యలు, పర్యవేక్షణ విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అలాగే గోదాం వద్ద అమలులో ఉన్న భద్రతా ప్రమాణాలు, వివిధ రికార్డుల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఈవీఎంల భద్రత, నిల్వ, పర్యవేక్షణకు సంబంధించి భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటించాలని అధికారులకు సూచించారు.
ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని రికార్డులను పకడ్బందీగా నిర్వహిస్తూ, గోదాం భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎన్నికల సూపరెండెంట్ గఫర్, విభాగ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.





