భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని మునిగలవీడు గ్రామ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు నర్సింహులగూడెం నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను వెంటనే ప్రారంభించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నల్లాని పాపారావు సంబంధిత అధికారులను కోరారు. మునిగలవీడు విద్యుత్ ఫీడర్‌ను నూతన సబ్‌స్టేషన్‌కు బదిలీ చేయడం ద్వారా గ్రామంలో తరచూ ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయాలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
సోమవారం నర్సింహులగూడెం సబ్‌స్టేషన్ వద్ద మునిగలవీడు గ్రామానికి చెందిన విద్యుత్ సమస్యలను పాపారావు విలేకరులకు వివరించారు. మునిగలవీడు సమీపంలోని ప్రస్తుత సబ్‌స్టేషన్‌లో నాలుగు ఫీడర్లు ఉండటంతో పాటు, వాటి పరిధిలో అనేక కిలోమీటర్ల మేర విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తోందన్నారు. దీంతో మునిగలవీడు గ్రామానికి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైతులు, గ్రామస్తులు పలుమార్లు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని పాపారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతను అధికారులు గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నర్సింహులగూడెం నూతన సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉండి కూడా చాలా నెలలు గడుస్తున్నా ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
నూతన సబ్‌స్టేషన్‌ను తక్షణమే ప్రారంభించి, మునిగలవీడు విద్యుత్ ఫీడర్‌ను అందులోకి బదిలీ చేయాలని పాపారావు కోరారు. ఈ మేరకు సంబంధిత విద్యుత్ శాఖ ఎస్సీ, డీఈ, స్థానిక ఏఈలు ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే మునిగలవీడు గ్రామ ప్రజలు, రైతులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉందన్నారు.





