భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం నెల్లికుదురు మండల కేంద్రంలో కొనసాగుతోంది. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో సింగారపు కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎంపీడీవో సింగారపు కుమార్ వెల్లడించారు. మండల వ్యాప్తంగా మొత్తం ఏడు దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వీటిలో రెవెన్యూ సమస్యలకు సంబంధించి మూడు, హౌసింగ్‌కు సంబంధించి రెండు దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యపై ఒక దరఖాస్తు, ఇరిగేషన్ సమస్యకు సంబంధించి మరో దరఖాస్తు వచ్చినట్లు ఎంపీడీవో వివరించారు.
ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరవుతున్నందున ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని ఎంపీడీవో కుమార్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందజేయాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు.
ప్రభుత్వ భూములు కాపాడాలి: సీపీఎం: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతూ సీపీఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు నేతృత్వంలో ప్రజావాణిలో ఎంపీడీవో కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.





