భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థులకు వ్యవసాయ సాగుపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు మండల కేంద్రం ఇనుగుర్తిలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో సోమవారం క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల బాలబాలికలు స్థానిక వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పత్తి, వరి పంటలను పరిశీలించారు. ఆయా పంటలను సాగు చేస్తున్న రైతులను విద్యార్థులు పంటల సాగు విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. విత్తన రకాల ఎంపిక, పంటలకు ఏ సమయంలో ఎలాంటి ఎరువులు వినియోగించాలి, చీడపీడల నివారణకు పురుగుమందులను ఎలా ఉపయోగించాలి వంటి అంశాలను రైతులు విద్యార్థులకు వివరించారు.

ప్రస్తుతం పంట ఏ దశలో ఉందో, పంట చేతికి రావడానికి ఎంత సమయం పడుతుందో రైతులు విద్యార్థులకు క్షేత్రస్థాయిలో వివరించారు. దీంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పంటల సాగు విధానాన్ని పరిశీలించి ఆసక్తికరంగా అవగాహన పొందారు. అనంతరం విద్యార్థులు రైతులతో మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ ఎరువులు, కషాయాలతో సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని సూచించారు. రైతులు ఆరోగ్యకరమైన పంటలను పండించేందుకు ప్రకృతి అనుకూల సాగు విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

కర్షకులను కాపాడుకుందాం: కరస్పాండెంట్ కట్టయ్య

బాల్యం నుంచే విద్యార్థుల్లో వ్యవసాయంపై ఆసక్తి, మక్కువతో పాటు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో క్షేత్ర ప్రదర్శన నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ తెలిపారు. రైతులు వ్యవసాయంలో ఎదుర్కొనే కష్టాలు, శ్రమను విద్యార్థులు ప్రత్యక్షంగా చూసేలా ఈ పర్యటన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థులు శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా ఈ అనుభవం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతుల సంక్షేమానికి అనుకూలమైన చట్టాలు, విధానాల రూపకల్పనలో భవిష్యత్ తరాలు భాగస్వాములు కావాలని కట్టయ్య ఆకాంక్షించారు. రైతుల పట్ల గౌరవభావం పెంపొందించడంతో పాటు వ్యవసాయం ప్రాధాన్యతను విద్యార్థులు అర్థం చేసుకునేందుకు క్షేత్ర పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఇన్‌చార్జ్ శ్రీలతతో పాటు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.