భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: తీర్థయాత్రకు వెళ్లిన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన పలువురికి మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సోమవారం మహారాష్ట్రలోని కుబీర్ మండల సరిహద్దుకు సమీపంలోని తొటాంబ గ్రామం వద్ద 14 మందితో వెళ్తున్న జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో మృతులను పార్డి (బి) గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో తులసీరామ్, గంగన్న, గంగాబాయి తదితరులు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో జీపులో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
శ్రావణ సోమవారం సందర్భంగా వీరంతా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని శివాలయానికి దైవదర్శనం కోసం వెళ్లినట్లు తెలిసింది. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మహారాష్ట్రలోని సాసర్ కొండ జలపాతాన్ని చూసి వస్తుండగా తొటాంబ వద్ద జీపు బోల్తా పడినట్లు సమాచారం. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు, పోలీసులు వారిని రక్షించి చికిత్స కోసం తరలించారు.
తీవ్రంగా గాయపడిన వారిని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దైవదర్శనానికి వెళ్లిన వారు ప్రమాదంలో మృతి చెందడంతో పార్డి (బి) గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






