భారత్ సమాచార్, మహబూబ్‌నగర్: రెవెన్యూ అధికారుల వేధింపులతో భార్యాపిల్లలతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన దేవరకద్ర మండలంలో చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో తనతాత పేరిట ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిని తన పేరుపై మార్చుకునేందుకు దేవరకద్ర తహసీల్దారు కార్యాలయంలో ఆటోడ్రైవర్ శంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. తాత పేరిట భూమిని తన పేరిట మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ అధికారులు, ఆర్ఐ సాహత్ రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా తనవద్ద అంతలేదని రూ.5 వేలు ఇస్తానని శంకర్ చెప్పాడు. కానీ మిగిలినవి ఇస్తేనే దస్త్రం కదులుతుందని అధికారులు చెప్పడం, ఆర్డీవో కార్యాలయానికి ఆన్‌లైన్‌లో దస్త్రం వెళ్లగా.. ఆఫ్‌లైన్‌లో తమకు రాలేదని సిబ్బంది అనడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శంకర్ తన ఆటోపై పెట్రోలు పోసి తన భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలతోపాటు తనపై పెట్రోలు పోసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆటోకు నిప్పంటుకోగా శంకర్ చేతులు కాలాయి.














