భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని జామ తండా సర్పంచ్ గుగులోతు సోమన్న అన్నారు. నెల్లికుదురు మండలం జామ తండాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులు మంజూరైన లబ్ధిదారులకు సర్పంచ్ సోమన్న స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డులు కేవలం రేషన్ సరుకులు పొందేందుకు మాత్రమే కాకుండా బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడతాయని సర్పంచ్ సోమన్న వివరించారు. కార్డుల ద్వారా లబ్ధిదారులు సులభంగా రేషన్ సరుకులు పొందవచ్చని, నకిలీ రేషన్ కార్డుల నివారణకు కూడా ఇవి దోహదపడతాయని చెప్పారు. ముఖ్యంగా ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్’ విధానంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లినా అర్హత మేరకు రేషన్ సరుకులు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే స్మార్ట్ రేషన్ కార్డులు ఆన్‌లైన్ సేవలు, వివిధ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ గుర్తింపు అవసరాలకు ఉపయోగపడతాయని సోమన్న తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత సులభంగా సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ్ కుమార్, జీపీఓ మురళీధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, వార్డు సభ్యులు సుమన్, రాజన్, వినోద్, విజయ, కారోబార్ లక్పతీ, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, రేషన్ డీలర్ రాజేశ్వర్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.


















