భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీఆర్‌ఎస్‌పై విజయం సాధించి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లికుదురులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల శాఖ అధ్యక్షులు ఎదళ్ల యాదవ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో కార్యక్రమం జరిగింది. తొలుత అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీలు వేం, బలరాం, ఎమ్మెల్యే మురళీనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రజా పాలనకు నాంది పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎదళ్ల యాదవ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనలోని ప్రగతి భవన్ ఇనుప గేట్లు బద్దలు కొట్టి ప్రజా పాలనకు నాంది పలికిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.
సంక్షేమ పథకాలతో ముందుకు
అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం వంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన వారికి రూ.5 లక్షలు మంజూరు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టిస్తోందని పేర్కొన్నారు. 1000 రోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు పులి వెంకన్న, వీరన్న, సోమన్న, బాలకృష్ణ, నాయకులు హెచ్. వెంకటేశ్వర్లు, సత్యపాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, గుట్టయ్య గౌడ్, తిరుపతాచారి, అశోక్, ప్రశాంత్, ఆనంద్ కిషన్ నాయక్, బండారి మల్లయ్యతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


















