భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట జిల్లా : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే చివ్వెంల నుంచే ‘చేయి’ పార్టీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ హెచ్చరించారు. శనివారం చివ్వెంలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు.
దివ్యాంగులకు పింఛన్ పెంచడం, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, ఉద్యోగాల భర్తీ వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని రాజేష్ విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం, వికలాంగుల విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తుందని ఆయన ప్రశ్నించారు. వెంటనే దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించి, అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మున్నా మధు యాదవ్, జిల్లా నాయకులు వడ్డేపల్లి విజయ్ కుమార్, ఆరూరి బాబు, బండారు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు :















